శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు


శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు

- తమిరి పుల్లారావు 9640945832


కదలిక లేని సృష్టిని ఊహించలేము. చలనం జీవ సహజం. లోకాలన్నీ జాగృదావస్థలో ఉండాలంటే కదలిక ఉండాలి. ఆ కదలికను శ్రీ విశ్వకర్మ భగవాన్‌ కలిగిస్తారు. కదలికలో పని దాగి ఉంటుంది. ఆ దృష్టితో చూసినట్లయితే పనిలేని జీవి ఉండనే ఉండదు. అందుకనే జీవులకు చలన శక్తి కలింగించేదీ ఆ విశ్వకర్మ భగవానే. ప్రతి పనిలో ఆయనే ఉన్నారు. పని చేసే వారందరికీ శ్రీ విశ్వకర్మే ఆరాధ్య దైవం. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17 వ తేదీన జరుపుకుంటున్నాము.  శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను మన రాష్ట్రం,  మన దేశంలోనే కాదు- అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆరాధిస్తున్నారు. ఉత్సవాలు జరుపుకుంటున్నారు. జీవికకు చిహ్నమైన అన్ని రకాల పనులలోనూ నిమగ్నమవుతున్నారు. సద్యస్ఫూర్తి పొందుతున్నారు. ఎందుకంటే ఆయన మనకు పనిచేసే శక్తినిస్తున్నారు. శక్తి వరదుడు ఆయన.

 ఈ చరాచర సృష్టికంతటికీ కర్త శ్రీ విశ్వకర్మ భగవాన్‌. ఆయన సంకల్పంచేతనే సకల సృష్టి నిర్మాణం జరిగిందని వేదోప నిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే శ్రీ విశ్వకర్మభగవాన్‌ ఈ భూగోళంపై నివసించే మానవులకు, సకల జీవకోటికీ ఆరాధ్య దైవం. అన్ని వృత్తుల వారికీ, ఉద్యోగులకు, పనిచేసే వారందరికీ, అన్ని కులాల, మతాలవారికీ పూజనీయుడు.  పని చేయాలనే స్పృహ  కలిగించేది శ్రీ విశ్వకర్మ భగవాన్‌. ఆ పని ఏదైనా కావచ్చు. చేతివృత్తి కావచ్చు. ఉద్యోగం కావచ్చు, వంట ఇంటిలో మహిళలు చేసే పని కావచ్చు, మరేదయినా కావచ్చు. అన్ని పనులకూ ఆయనే స్పూర్తిదాత. అందుకనే వివిధ పనిముట్లను, ఆయుధాలను ధరించి ఉన్న  శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి, దేవేంద్రుడు, శచీదేవి, తదితర దేవతాగణం అంతా సేవిస్తూ ఉంటారు. దేవతలకు మహాశక్తిమంతమైన ఆయుధాలను తయారు చేసి ఇవ్వడమే గాక మహానగరాలను కూడా నిర్మించి ఇచ్చాడు శ్రీ విశ్వకర్మభగవాన్‌. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకను సర్వాంగ సుందరంగా, కమనీయంగా, నేత్రపర్వంగా నిర్మించింది ఆయనే. ఇంద్రప్రస్థ, హస్తినాపురం అనే నగరాలను కూడా సృష్టించింది ఆయనే. సృష్టిలో అపురూపమైన, వెలుగులు విరజిమ్మే స్వర్ణలంక (శ్రీలంక)ను నిర్మించిందీ ఆయనే. మయ సభను విశ్వకర్మ శిష్యుడైన మయుడు నిర్మించాడు. అంతేకాదు గర్భస్థ ఆంజనే యునికి ఉత్తర జంధ్యాలు, బటువు, కవచం తయారు చేసిఇచ్చి హనుమ జననాన్ని సులభం చేసినట్లు పురాణాల్లో మనం చదువు కుంటాం. శ్రీమహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రాన్ని తయారు చేసింది ఆయనే. అలాగే శ్రీ విశ్వకర్మ సృష్టించిన ఆయుధాలలో ముఖ్యమైనది ఆగ్నేయాస్త్రం. పుష్పక విమానాన్ని తయారు చేసుకుని, దానిపై ప్రయాణించే శ్రీ విశ్వకర్మభగవాన్‌ దేవతలందరికీ ఆరాధ్యు డుగా భాసిల్లుతున్నాడు.
ఇనుప వస్తువులను తయారు చేసే కమ్మర వృత్తివారు, దారు(చెక్క) వస్తువులు తయారు చేసే వడ్రంగి వృత్తివారు, ఇత్తడి, కంచు పాత్రలు తయారు చేసే కంచరవృత్తివారు, దేవతా శిల్పాలు ఆదిగా వివిధ శిల్పాలను నిర్మించే శిల్పి వృత్తివారు, స్వర్ణాభరణాలు తయారు చేసే స్వర్ణవృత్తివారు శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను తమ కులదైవంగా భావించి ఆరాధించేవారు. ఆరాధిస్తున్నారు. అయితే ఆయన ఈ చరాచర సృష్టికి కారణభూతుడు, సృష్టికర్త, నిర్మాణ రంగంలో నిపుణుడు కావడంతో ఆయనను అన్ని వర్గాలవారూ, అన్ని వృత్తులవారూ అర్చించడం ప్రారంభించారు. కర్మ (పని) ప్రధానంగా కలిగిన వారందరికీ అంటే కార్మికులందరికీ ఆయన ఆరాధ్యుడు. ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు సహా సకల వృత్తులవారికీ ఆయన పూజనీయుడు. అన్ని పనులకు రూపకల్పన చేసే బుద్ధి జీవులకు కూడా ఆయన ఆరాధ్యుడే. పురాణాలలో శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను థబాహువులు కలవాడుగా వర్ణించారు. ఆ పది చేతులలో రకరకాల తయారీ పరికరాలు ఉంటాయి. అందుకనే ఆయనను 'స్థాపత్యవేద' అని కూడా వర్ణించారు. ఆయన త్రిమూర్తులతో సమానమైన శక్తి సామర్థ్యాలుగల వాడుగా కూడా పేర్కొన్నారు.
మన భారతదేశంలో సెప్టెంబరు 17 వ తేదీన కార్మిక దినోత్సవంగా భావించి శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను ఆరాధిస్తారు. అదే రోజున భారీస్థాయిలో ఆయన జయంతి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. జమ్‌షెడ్‌పూర్‌లోని ఉక్కు కర్మాగారంలో శ్రీ విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లోనూ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉదయ భాస్కర్, శ్రీరాములు చౌదరి సంస్మరణార్థం పేదలకు అన్నదానం